📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిరాహుల్ గాంధీ కా లడాయి... దేశ్ కే లియే బలాయి : జగ్గారెడ్డి

రాహుల్ గాంధీ కా లడాయి… దేశ్ కే లియే బలాయి : జగ్గారెడ్డి

సంగారెడ్డి, జూలై 25 (నవజ్యోతి ప్రతినిధి):

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటాలకు మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిలో భారీ “రాహుల్ గాంధీ విక్టరీ ర్యాలీ” నిర్వహించారు. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పాత బస్టాండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్ కుమార్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ “రాహుల్ గాంధీ కా లడాయి… దేశ్ కే లియే బలాయి” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాహుల్ గాంధీ పోరాటం దేశ ప్రజల కోసం, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతోందని అన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల తరఫున రాహుల్ గాంధీ నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రధాని నివాసం ఎదుట ధర్నా నిర్వహించిన తర్వాత ఉద్యమం మరింత ఉద్ధృతమైందని తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొనడం రాహుల్ గాంధీ పోరాటానికి నిదర్శనమని అన్నారు.

దేశ ప్రజల సంక్షేమం, భద్రత, విద్యార్థుల భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఎప్పుడు పిలుపునిచ్చినా సంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమాలకు సిద్ధంగా ఉంటాయని, ఆయన ప్రధానమంత్రి అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ్ కుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుత రాజకీయాలకు కట్టుబడి ఉంటుందని చెబుతూ, లాల్ బహదూర్ శాస్త్రి, మాధవరావు సింధియా వంటి నాయకులు నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావించారు. అదే కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంస్కృతి అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!