సంగారెడ్డి, జూన్ 30 (నవజ్యోతి ప్రతినిధి):
పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో 2025 జూన్ 30న జరిగిన ఘోర పేలుడు ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఏడాది గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం, ప్రకటించిన పరిహారం అందలేదని బాధితులు, ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రమాదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మృతుడి కుటుంబానికి ₹1 కోటి పరిహారం, గాయపడిన వారికి ఆర్థిక సాయం, పూర్తి వైద్య చికిత్స అందిస్తామని ప్రకటించింది. అయితే ప్రకటించిన పరిహారం ఇప్పటికీ పూర్తిగా అందలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గాయపడిన పలువురు కార్మికులు ఆరోగ్య సమస్యలతో పాటు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసిన నిపుణుల కమిటీ పరిశ్రమలో భద్రతా లోపాలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. బాధితులకు పూర్తి పరిహారం, పునరావాసం కల్పించాలని, కంపెనీ ఆస్తులను జప్తు చేసి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
సిగాచి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు పాశమైలారంలో నిరసన కార్యక్రమాలు, అలాగే హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) ప్రకటించింది. ఈ సమావేశంలో బాధిత కుటుంబాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను మరోసారి వినిపించనున్నారు.

