📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్రెండు చుక్కలు.. జీవితానికి రక్షణ

రెండు చుక్కలు.. జీవితానికి రక్షణ

– ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు

– తల్లిదండ్రులకు సీఎం విజ్ఞప్తి

– పోలియో రహిత తెలంగాణే లక్ష్యం

హైదరాబాద్, జూన్‌ 28 (నవజ్యోతి ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని అన్నారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నివారించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన జీవితానికి ఇది అత్యంత అవసరమని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలకు చిన్నారులను తీసుకువెళ్లి రెండు చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఏ చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

చిన్నారుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని కోరారు. పోలియో రహిత తెలంగాణ, పోలియో రహిత భారతదేశం సాధనే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన భావితరాలకు బాటలు వేయవచ్చని ఆయన అన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!