– రాహుల్ గాంధీపై దళిత వ్యతిరేక ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నం
– బంగారు లక్ష్మణ్ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలి….
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నవజ్యోతి ప్రతినిధి) : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎంతో గౌరవిస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విమర్శలను ఆయన ఖండించారు. ఉత్తరాఖండ్‌లో ఖర్గే పాల్గొన్న సభ అనంతరం సభా ప్రాంగణాన్ని బీజేపీ అనుబంధ నాయకులు శుభ్రం చేసిన ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రశ్నించారని, ఆ వ్యాఖ్యలను బీజేపీ ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గేను అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాహుల్ గాంధీకి ఎస్సీ, ఎస్టీ అనే భేదభావం లేదని, ఖర్గే పట్ల ఆయన ఎప్పుడూ గౌరవంగా వ్యవహరిస్తారని చెప్పారు. అవసరమైన సందర్భాల్లో ఖర్గే చేయి పట్టుకుని నడిపిస్తూ రాహుల్ చూపించే గౌరవమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణకు చెందిన దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించిన జగ్గారెడ్డి, ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితులపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెహల్కా స్టింగ్ ఆపరేషన్ అనంతరం బంగారు లక్ష్మణ్‌ను అవమానకరంగా పదవి నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు. దళిత నాయకుల పట్ల కాంగ్రెస్, బీజేపీ వ్యవహరించే తీరులో స్పష్టమైన తేడా ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం ఖర్గేకు అత్యున్నత గౌరవం ఇస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీపై అసత్య ప్రచారం చేయడం మానుకుని, బంగారు లక్ష్మణ్ విషయంలో తమ గత వైఖరిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

