మిస్సింగ్ కేసు నమోదు.. ఆచూకీ కోసం బిక్కనూరు పోలీసుల గాలింపు…
బిక్కనూరు, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన కోటిగళ్ల రాజశేఖర్ (36) తన ఇద్దరు కుమారులు ఆర్యన్ (12), అయాన్ (8)తో కలిసి అదృశ్యమైన ఘటనపై బిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజశేఖర్‌కు శ్రావణితో 14 సంవత్సరాల క్రితం వివాహం కాగా వీరికి ముగ్గురు సంతానం. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకోవడంతో శ్రావణి ఒక కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి రాజశేఖర్ తన ఇద్దరు కుమారులతో కలిసి తిప్పాపూర్‌లో నివాసముంటున్నాడు.
ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో రాజశేఖర్ తన ఇద్దరు కుమారులతో బయటకు వెళ్లి కొద్దిసేపట్లో తిరిగి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన మొబైల్‌కు పలుమార్లు ఫోన్ చేసినా స్విచ్‌ఆఫ్ వచ్చింది. బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో రాజశేఖర్ తల్లి కోటిగళ్ల గంగవ్వ బిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో బిక్కనూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్, ఆర్యన్, అయాన్‌ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
రాజశేఖర్, ఆర్యన్, అయాన్‌ల గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే బిక్కనూరు పోలీస్ స్టేషన్‌ను లేదా 8712686154 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

