రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని 5వ వార్డు ప్రజల హెచ్చరిక
తూప్రాన్, ఆగస్టు 1 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):
తూప్రాన్ పట్టణంలో అభివృద్ధి పేరుకే ఉందని, కాలనీల్లో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 5వ వార్డు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఇంటి పన్నులు, ఇతర పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులకు ప్రజల సమస్యలు మాత్రం కనిపించడం లేదని మండిపడ్డారు.
పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ ప్రధాన రహదారి నుంచి లక్ష్మీ గార్డెన్, గోల్డెన్ పార్క్ వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని స్థానికులు తెలిపారు. వర్షం కురిసిన ప్రతిసారి గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోందన్నారు. గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక కాలనీ వాసులు మాట్లాడుతూ, రహదారిపై రోజురోజుకు గుంతలు పెరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల నుంచి సకాలంలో పన్నులు వసూలు చేస్తున్న అధికారులు కనీస మౌలిక వసతుల కల్పనలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తక్షణమే రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేపట్టి మరమ్మతులు పూర్తి చేయాలని, లేకపోతే రానున్న వర్షాలతో రహదారి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమస్య పరిష్కారంలో అధికారులు ఆలస్యం చేస్తే 5వ వార్డు ప్రజల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

