📄 ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రూ.28 లక్షల క్యూ నెట్ స్కాం.. ఇద్దరి అరెస్ట్

రూ.28 లక్షల క్యూ నెట్ స్కాం.. ఇద్దరి అరెస్ట్

బజాజ్ ఫైనాన్స్ రుణాలతో పెట్టుబడులు పెట్టించినట్లు ఆరోపణలు.. పుణెలో నిందితులను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఈఓడబ్ల్యూ…

భారీ లాభాలు, ఆర్థిక స్వేచ్ఛ పేరుతో హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలను మోసగించి రూ.28 లక్షలు పెట్టుబడి పెట్టించిన క్యూ నెట్ (QNet) కేసులో ఇద్దరిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జూలై 31న మహారాష్ట్రలోని పుణెలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

అరెస్టయిన వారిని పడమటి సురేందర్ రెడ్డి (55), పర్వీందర్ సింగ్ ఫింగ్ (37)గా గుర్తించారు. వీరిద్దరూ క్యూ నెట్/విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్‌లుగా వ్యవహరిస్తూ ఈ-కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ద్వారా అధిక ఆదాయం వస్తుందని నమ్మించి బాధితులను ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుల వద్ద పెట్టుబడి పెట్టేందుకు డబ్బు లేదని తెలుసుకున్న నిందితులు బజాజ్ ఫైనాన్స్ ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పించి మొత్తం రూ.28 లక్షలు పెట్టుబడి పెట్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇది వాస్తవానికి కొత్త సభ్యులను చేర్చడం ఆధారంగా నడిచే బైనరీ చైన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) విధానమని బాధితులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా నిందితులు స్పందించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

దర్యాప్తులో సురేందర్ రెడ్డి ప్రస్తుతం పుణెలోని ఒక ప్రైవేట్ సంస్థలో, పర్వీందర్ సింగ్ ఫింగ్ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగులుగా పనిచేస్తూనే క్యూ నెట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే కేసులో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దిలీప్ రాజ్ పుక్కెళ్లను ఈ ఏడాది మే 27న అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఈ కేసును భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) చట్టం-1978, తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం-1999 నిబంధనల కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఈఓడబ్ల్యూ వెల్లడించింది.

ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని, కొత్త సభ్యులను చేర్చితే అధిక ఆదాయం వస్తుందని ప్రచారం చేసే పిరమిడ్, మనీ సర్క్యులేషన్, మల్టీ లెవల్ మార్కెటింగ్ పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థ విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!