📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జర్మనీలో మెరిసిన తెలంగాణ ఐశ్వర్య లక్ష్మి..!

జర్మనీలో మెరిసిన తెలంగాణ ఐశ్వర్య లక్ష్మి..!

నెలకు రూ.3.5 లక్షల వేతనంతో ఐశ్వర్యరాణికి ఉద్యోగం…

హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ యువత అంతర్జాతీయ ఉద్యోగ విపణిలో మరోసారి తన సత్తా చాటింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువ ఫిజియోథెరపిస్టు పి. ఐశ్వర్యరాణి జర్మనీలో నెలకు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగం సాధించారు.

విదేశాల్లో ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న ఐశ్వర్యరాణి టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాషలో బీ2 స్థాయి వరకు ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు. అనంతరం ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి జర్మనీలో ఫిజియోథెరపిస్టుగా నియామకం పొందారు. అక్కడ విధుల్లో చేరిన తర్వాత వృత్తిపరమైన శిక్షణ పూర్తయిన అనంతరం ఆమె వేతనం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఐశ్వర్యరాణికి నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. తెలంగాణ యువతకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విదేశీ భాషలపై పట్టు, వృత్తిపరమైన నైపుణ్యాలు ఉంటే ప్రపంచవ్యాప్తంగా మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ కూడా ఐశ్వర్యరాణిని అభినందిస్తూ, టామ్‌కామ్ ద్వారా అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి, విదేశీ భాషల శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరైన ప్రణాళిక, శిక్షణతో విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనని అన్నారు.

కార్యక్రమంలో టామ్‌కామ్ అధికారులు, ఐశ్వర్యరాణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ కెరీర్ దిశగా టామ్‌కామ్ అందిస్తున్న అవకాశాలకు ఐశ్వర్యరాణి విజయం మరో నిదర్శనంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!