పీఎంఓ ప్రగతి సమీక్షలో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రం..
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆధ్వర్యంలో ఆగస్టు 6న నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్ష సమావేశంలో సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, డిజిటల్ పాలన, ప్రజా అవగాహన, సామర్థ్యాభివృద్ధి వంటి తొమ్మిది కీలక అంశాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబర్చి దేశంలోనే తొలి స్థానాన్ని దక్కించుకుంది.
భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), కేంద్ర హోంశాఖ పరిధిలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్ర సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎస్4సీ) ఏర్పాటు, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ అమలు, గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మాడ్యూల్ (జీఆర్‌ఎం), మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్‌ఎం) సమర్థ వినియోగం, సహయోగ్, సమన్వయ పోర్టళ్ల వినియోగం, సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్‌ల గుర్తింపు, పోలీసులకు ప్రత్యేక శిక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో తెలంగాణకు అత్యధిక మార్కులు లభించాయి.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌ను సమర్థంగా అమలు చేయడం, ఐ4సీ రూపొందించిన డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగించడంపై పీఎంఓ తెలంగాణను ప్రత్యేకంగా అభినందించింది.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) 8712665600 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే జీఆర్‌ఎం, ఎంఆర్‌ఎం సేవలను వినియోగించే విధానంపై సోషల్ మీడియా వేదికల ద్వారా అవగాహన వీడియోలను విడుదల చేసింది.
సాంకేతికత ఆధారిత పోలీసింగ్, సమర్థవంతమైన దర్యాప్తు, ప్రజాకేంద్రీకృత సేవలతో తెలంగాణ సైబర్ నేరాల నియంత్రణలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.

