30 తులాల వెండి, రూ.90 వేల నగదు అపహరణ.. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు…
కామారెడ్డి, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి పట్టణంలోని విద్యుత్‌నగర్ కాలనీలో దొంగలు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తలుపు గడియ, బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 16 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.90 వేల నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు.
విద్యుత్‌నగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మామిండ్ల లావణ్య, ఆమె భర్త సురేష్‌కుమార్ లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. పనిమీద వరంగల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు గడియ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటంతో పాటు బీరువా తాళం కూడా ధ్వంసమై ఉండటంతో పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చోరీకి గురైన వాటిలో రెండు బంగారు గొలుసులు 1.5 తులాలు, నల్లపూసల బంగారు గొలుసు 3 తులాలు, ఏడు ఉంగరాలు 2.5 తులాలు, బంగారు చెవి ఆభరణాలు 0.5 తులా, మూడు జతల చెవి దిద్దులు ఒక తులం ఉన్నాయి. రెండు బంగారు బిస్కెట్లు 5 తులాలు, నాలుగు బంగారు బిస్కెట్ ముక్కలు 2.5 తులాలు కలిపి మొత్తం సుమారు 16 తులాల బంగారం అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే ఐదు జతల వెండి పట్టీలు సుమారు 20 తులాలు, ఒక వెండి బిస్కెట్ సుమారు 10 తులాలు, రూ.90 వేల నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం చోరీ ఆస్తి విలువను సుమారు రూ.3.50 లక్షలుగా నమోదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎఫ్‌ఐఆర్ నంబర్ 344/2026గా బీఎన్‌ఎస్ 331(4), 305 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎస్‌ఐ రంజిత్ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులుగా గుర్తుతెలియని వ్యక్తులను పేర్కొన్నారు.
చోరీకి సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీఎస్, క్లూస్ టీమ్ సహాయంతో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

