📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper

భక్తిశ్రద్ధలతో రుక్మిణికుంట శ్రీరామ్‌నగర్‌ కాలనీలో బోనాల వేడుకలు…

కామారెడ్డి, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి పట్టణంలోని రుక్మిణికుంట శ్రీరామ్‌నగర్‌ కాలనీలో కట్ట మైసమ్మ బోనాలు, తొట్టెల కార్యక్రమాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. ఆయనకు కాలనీ ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.

ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థన

అమ్మవారి ఆశీస్సులతో కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని షబ్బీర్‌ ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగలు ప్రతీకలని, తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలందరూ ఐక్యత, సోదరభావంతో పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు స్థానికంగా నిర్వహించే పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు సమర్పించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, భక్తుల నినాదాలతో కాలనీ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమా శ్రీనివాస్‌, కైలా శ్రీనివాస్‌రావు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు మహమ్మద్‌ ఇలియాస్‌, ఐరేణి సందీప్‌, కౌన్సిలర్లు అంజద్‌, లడ్డు, సత్యం, భాస్కర్‌ గౌడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!