మన సంస్కృతి, సంప్రదాయాలను భవితరాలకు అందించాలి: సర్పంచ్ నీలం సాయికుమార్ గౌడ్…
మనోహరాబాద్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):

మనోహరాబాద్ మండలం పాలట గ్రామంలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ నీలం సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు సంప్రదాయ పద్ధతిలో బోనాలను సిద్ధం చేసి గ్రామంలోని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ అమ్మవార్లకు సమర్పించారు. డప్పుల మేళాలు, మంగళవాయిద్యాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీలం సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఇటువంటి పండుగల ద్వారా మన సంస్కృతి, ఆచారాలను భవితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
వేడుకల్లో భాగంగా అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు, అర్చనలు నిర్వహించి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం డప్పుల మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు సందడిగా సాగాయి.
కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, స్థానిక పెద్దలు, నాయకులు, మహిళలు, యువత, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

