బిక్కనూర్, ఆగస్టు 19 (నవజ్యోతి ప్రతినిధి):
మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో వ్యవసాయ బావుల వద్ద కాపర్ కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. లక్ష్మీదేవునిపల్లికి చెందిన ప్రణయ్ కుమార్‌తో పాటు రాజంపేట మండలానికి చెందిన నందగోపాల్ లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 250 మీటర్ల కేబుల్, స్ప్లెండర్ ప్లస్ బైక్, రెండు సెల్‌ఫోన్లు, కట్టింగ్ ప్లేయర్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జగడం నరేష్ వెల్లడించారు.
ప్రత్యేక నిఘాతో.. చాకచక్యంగా పట్టివేత
జన సంచారం తక్కువగా ఉండే వ్యవసాయ బావులను లక్ష్యంగా చేసుకుని నిందితులు రాత్రివేళల్లో కేబుల్ వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచడంతో నిందితుల కదలికలను గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. చోరీ చేసిన కేబుల్‌ను స్క్రాప్ దుకాణాల్లో విక్రయించి సొమ్ము చేసుకునేవారని పోలీసులు వెల్లడించారు.
ట్రాన్స్‌ఫార్మర్ చోరీలపైనా ఆరా
బిక్కనూర్ మండలంలో గతంలో బస్వాపూర్, గుర్జకుంట శివారుల్లో రైతుల పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి ఆయిల్, కాపర్ కాయిల్స్ చోరీ చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో తాజా కేబుల్ చోరీలో పట్టుబడిన నిందితులకు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలతోనూ సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది.
నిందితులను లోతుగా విచారిస్తే గతంలో జరిగిన ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వారి గత నేర చరిత్ర, ఇతర చోరీలతో సంబంధం, దొంగిలించిన సామగ్రి విక్రయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైతులకు పోలీసుల సూచన
వ్యవసాయ బావుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ అనిల్ రైతులకు సూచించారు. కాపర్ దొంగలు పట్టుబడటంతో గతంలో జరిగిన ట్రాన్స్‌ఫార్మర్ చోరీల మిస్టరీ కూడా వీడుతుందా? అన్నది పోలీసుల దర్యాప్తుతో తేలాల్సి ఉంది.

