📄 ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలకు కొత్త రేట్లు !

తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలకు కొత్త రేట్లు !

హైదరాబాద్‌, ఆగస్టు 19 (నవజ్యోతి ప్రతినిధి):

తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్లను కొత్తగా వర్గీకరిస్తూ టికెట్‌ ధరలను నిర్ణయించింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో పాటు ప్రత్యేక థియేటర్లు, సూపర్‌ హై బడ్జెట్‌ సినిమాలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ జీఓఎంఎస్‌ నంబర్‌ 77ను ఈ నెల 14న విడుదల చేసింది. కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

టికెట్‌ ధరలు ఇలా..

థియేటర్‌ నాన్‌ ప్రీమియం ప్రీమియం
నాన్‌-ఏసీ రూ.30–70 రూ.50–100
ఏసీ / ఎయిర్‌ కూల్డ్‌ రూ.50–150 రూ.100–200
స్పెషల్‌ థియేటర్లు రూ.100–250 రూ.200–300
మల్టీప్లెక్స్‌ రూ.100–250 రూ.200–300 (రిక్లైనర్‌)

ఈ ధరల్లో ఏసీ/ఎయిర్‌ కూల్డ్‌ థియేటర్లకు రూ.5, నాన్‌-ఏసీ థియేటర్లకు రూ.3 నిర్వహణ ఛార్జీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ సర్వీస్‌ ఛార్జీలు మాత్రం అదనంగా ఉంటాయి.

రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌ సినిమాలకు ప్రత్యేక వెసులుబాటు

రూ.100 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం కలిగిన సినిమాలను ‘సూపర్‌ హై బడ్జెట్‌ ఫిల్మ్‌’గా ప్రభుత్వం గుర్తించనుంది. భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌, 2కే/4కే లేదా అంతకంటే అధిక రిజల్యూషన్‌, ఐమ్యాక్స్‌ లేదా ఇతర భారీ ఫార్మాట్లు, అధునాతన సౌండ్‌ సిస్టమ్స్‌, భారీ సెట్లు, జాతీయ స్థాయి నటీనటులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

అయితే అధిక టికెట్‌ ధరలకు ఆటోమేటిక్‌గా అనుమతి ఉండదు. నిర్మాతలు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం సినిమా వివరాలను పరిశీలించి కేసుల వారీగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుంది. తొలి విడుదల నుంచి గరిష్ఠంగా 10 రోజుల వరకు పెంచిన ధరలను అనుమతించే అవకాశం ఉంటుంది.

అదనంగా నిర్మాతల నుంచి ప్రభుత్వం నిర్ణయించే మొత్తంలో, గరిష్ఠంగా రూ.1 కోటి వరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ నిధికి జమ చేయించే విధానం కూడా ఉత్తర్వుల్లో ఉంది.

ప్రతి థియేటర్‌లో 25 శాతం నాన్‌ ప్రీమియం సీట్లు

ఏసీ, నాన్‌-ఏసీ, స్పెషల్‌ థియేటర్‌, మల్టీప్లెక్స్‌ అనే తేడా లేకుండా ప్రతి థియేటర్‌లో 25 శాతం సీట్లను నాన్‌ ప్రీమియం కేటగిరీగా ఉంచాలి. మొత్తం సీట్ల సంఖ్య ఆధారంగా ఈ 25 శాతం నిర్ణయిస్తారు.

ఎయిర్‌ కూల్డ్‌ థియేటర్లను ఏసీ థియేటర్ల కేటగిరీలో కలిపారు. వాటిని ఏసీగా మార్చుకునేందుకు లేదా నాన్‌-ఏసీ ధరలు వసూలు చేసేందుకు రెండేళ్ల గడువు ఇచ్చారు.

ప్రత్యేక థియేటర్లకు ప్రత్యేక కేటగిరీ

7.1 లేదా అంతకంటే ఎక్కువ డిజిటల్‌ సరౌండ్‌ సౌండ్‌, 2కే/4కే ప్రొజెక్షన్‌, ఐమ్యాక్స్‌/75 అడుగులు లేదా అంతకంటే పెద్ద తెర వంటి సదుపాయాలు కలిగిన సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను ‘స్పెషల్‌ థియేటర్లు’గా గుర్తించనున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్‌ లేదా పోలీస్‌ కమిషనర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

థియేటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చు. అయితే పండుగ రోజుల్లో అధిక బడ్జెట్‌ సినిమా విడుదలతో తక్కువ బడ్జెట్‌ సినిమా పోటీ పడుతున్న సందర్భంలో కనీసం ఒక షోను ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్య చిన్న బడ్జెట్‌ సినిమాకు కేటాయించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ యథాతథం

సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగుతుంది. ధరలు, లైసెన్సింగ్‌, ఇతర అంశాలపై అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, లైసెన్సింగ్‌ అధికారులు, సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!