“సురక్షా కా తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ”తో విస్తృత అవగాహన…
తూప్రాన్/చేగుంట, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):
సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో విజృంభిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మోసాల నుంచి రక్షణ సాధ్యమని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో జాతీయ “సైబర్ జాగృత్ దివస్” సందర్భంగా నిర్వహిస్తున్న “సురక్షా కా తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా బుధవారం చేగుంటలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
సోషల్ మీడియాలో కనిపించే నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి ప్రకటనలను నమ్మి డబ్బులు పెట్టవద్దని డీఎస్పీ సూచించారు. మోసగాళ్లు ముందుగా వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి, భారీ లాభాలు వచ్చినట్లు నకిలీ స్క్రీన్‌షాట్లు చూపించి, నమ్మకం కలిగించిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారని వివరించారు.
ఉద్యోగాల పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటి పేర్లతో డబ్బులు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలని తెలిపారు. ఉద్యోగం ఇచ్చే సంస్థ అభ్యర్థికి జీతం చెల్లిస్తుందని, ఉద్యోగం కోసం అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేయదని గుర్తుంచుకోవాలని సూచించారు.
బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఏటీఎం లేదా డెబిట్ కార్డు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు. ఫేక్ అకౌంట్లు, ఫిషింగ్ లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా వ్యవహరించినప్పుడే “సైబర్ స్వతంత్ర తెలంగాణ” లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.
అనంతరం విద్యార్థులతో సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బిక్య నాయక్, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

