అతివేగమే తీసిన ప్రాణం .. సీసీ కెమెరాతో చిక్కిన రైడర్
కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): రోడ్డు దాటేందుకు అడుగు వేసిన వ్యక్తిని క్షణాల్లో మృత్యువు కబళించింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అంజయ్యనగర్‌కు చెందిన కార్పెంటర్ మడిపోజు విజయ్‌కుమార్ (40) ప్రాణాలు కోల్పోయాడు.
ఈ నెల 5న భువనగిరి ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న విజయ్‌కుమార్, రాత్రి సుమారు 11:30 గంటలకు ఓం సాయి స్టేషనరీ సమీపంలో రోడ్డు దాటుతుండగా TS08GG2136 నంబర్ గల హోండా డియో స్కూటీ అతివేగంగా దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే పద్మజ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడి భార్య ఉషాశ్రీ ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డవడంతో, వాటి ఆధారంగా స్కూటీ రైడర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు జగద్గిరిగుట్ట సీఐ ఎన్. సురేష్ తెలిపారు.

