📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రోడ్ నెట్‌వర్క్‌కు ఏకీకృత వ్యవస్థ.. సీఎం రేవంత్ ఆదేశాలు

రోడ్ నెట్‌వర్క్‌కు ఏకీకృత వ్యవస్థ.. సీఎం రేవంత్ ఆదేశాలు

ఓఆర్ఆర్ నిర్వహణ, రేడియల్ రోడ్లు, ఫ్లైఓవర్ల పనులు వేగవంతం చేయాలని సూచన…

హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రోడ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

భూసేకరణ, రుణ సేకరణ, రోడ్ల నిర్వహణతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇతర రహదారి ప్రాజెక్టులన్నింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఓఆర్ఆర్ నిర్వహణలో లోపాలు, రహదారిపై వాహనాల నిలిపివేత కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. కొంగరకలాన్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్–1ను డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను వెంటనే తొలగించి, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు.

రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించే చర్యలు తీసుకోవాలని, బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ నిర్మాణంతో పాటు బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధి రోడ్ల విస్తరణపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్న ముఖ్యమంత్రి, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యానికి అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. టీడీఆర్‌ల జారీ ప్రక్రియ పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!