📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రూ.1,144.85 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు..

రూ.1,144.85 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు..

రాష్ట్రవ్యాప్తంగా 105 సమీకృత విద్యా ప్రాంగణాల నిర్మాణానికి నిధుల విడుదల…

హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1,144.85 కోట్లను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు.

మొత్తం 105 పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం 86 క్యాంపస్‌లలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన 19 పాఠశాలలకు త్వరలో పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రతి క్యాంపస్‌ను 25 నుంచి 30 ఎకరాల్లో నిర్మించి, 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా రూపకల్పన చేశారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, సైన్స్ ల్యాబ్‌లు, ఆధునిక గ్రంథాలయాలు, అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా మైదానాలు, హాస్టళ్లు, డైనింగ్ హాల్స్, సిబ్బంది నివాస గృహాలు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రస్తుతం వేర్వేరుగా కొనసాగుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల విధానానికి బదులుగా, అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదివే సమీకృత విద్యా వ్యవస్థను ఈ పథకం ద్వారా అమలు చేయనున్నారు.

నిధుల విడుదలతో నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుని, దశలవారీగా పాఠశాలలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా విద్యను బలోపేతం చేయడంతో పాటు సామాజిక సమైక్యతకు ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!