వార్తకు స్పందించిన ప్రభుత్వం.. కొత్త తరగతి గదుల నిర్మాణానికి నిధుల విడుదల..
ఖమ్మం, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థకు చేరిన తరగతి గదులపై ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్‌ను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ గురువారం పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిరను అభినందించారు. అనంతరం పాఠశాలలో కొత్త తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, వెంటనే నిధులు విడుదల చేశారు.
అంతకుముందు ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్ పాఠశాల ఉపాధ్యాయిని ఇందిరతో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో తీసుకున్న నిర్ణయంతో పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.
కొత్త తరగతి గదుల నిర్మాణంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, సురక్షితమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

