📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్డిసెంబర్‌ టార్గెట్‌.. మూడు పబ్లిక్‌ స్కూళ్లు !

డిసెంబర్‌ టార్గెట్‌.. మూడు పబ్లిక్‌ స్కూళ్లు !

పైలట్‌ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి.. ఫర్నిచర్‌కు జైళ్ల శాఖతో సమన్వయం: నవీన్‌ నికోలస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ (టీపీఎస్‌) పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలల పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యా కమిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడు పాఠశాలల పనులపై ప్రతి బుధవారం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న కమిషన్‌.. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించింది.

డిసెంబర్‌లోగా పనులు పూర్తి

డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నవీన్‌ నికోలస్‌, విద్యా కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ చారకొండ వెంకటేష్‌, జోష్నా శివారెడ్డి, ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌, తెలంగాణ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ గణపతి రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల హెచ్‌ఎంలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. నిర్మాణ పనుల పురోగతి, నిధులు, మౌలిక వసతులు, ఫర్నిచర్‌ తదితర అంశాలపై సమీక్షించారు.

నిధుల సమస్యతో పనులు నిలిచిపోకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని నవీన్‌ నికోలస్‌ సూచించారు. మిగిలిన పనులను వేగవంతం చేసి డిసెంబర్‌ గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

జైళ్ల శాఖ నుంచి ఫర్నిచర్‌

మూడు పబ్లిక్‌ స్కూళ్లకు అవసరమైన ఫర్నిచర్‌ను జైళ్ల శాఖ నుంచి సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో తయారు చేసే ఫర్నిచర్‌ను టీపీఎస్‌లకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్‌ వివరాలతో పూర్తి ఇండెంట్‌ సిద్ధం చేయాలని హెచ్‌ఎంలను నవీన్‌ నికోలస్‌ ఆదేశించారు.

విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల అవసరాలకు అనుగుణంగా డెస్కులు, బెంచీలు, టేబుళ్లు, కుర్చీల వివరాలను ముందుగానే సిద్ధం చేసి, పాఠశాల భవనాల పనులు పూర్తయ్యే సమయానికి ఫర్నిచర్‌ కూడా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

ఎంబీల నమోదులో సమన్వయం

మూడు టీపీఎస్‌లలో పూర్తయిన పనులకు సంబంధించి ఎంబీలు (మెజర్‌మెంట్‌ బుక్స్‌) నమోదు చేయడంలో ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలంగాణ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ గణపతి రెడ్డి తెలిపారు. పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ, బిల్లుల ప్రక్రియలో సమన్వయంతో వ్యవహరిస్తామని చెప్పారు.

క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సమావేశంలో సూచించారు. అధికారులు, హెచ్‌ఎంలు, నిర్మాణ సంస్థలు సమన్వయంతో పనిచేసి డిసెంబర్‌ నాటికి మూడు పబ్లిక్‌ స్కూళ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!