📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రేవంత్‌ ప్రభుత్వంపై పోచారం తిరుగుబాటు స్వరం!

రేవంత్‌ ప్రభుత్వంపై పోచారం తిరుగుబాటు స్వరం!

కేసీఆర్‌ను మోసం చేయడం ఇష్టం లేదు.. అభివృద్ధి కోసమే పార్టీ మారా.. ‘‘నేను నీకు అమ్ముడుపోయానా?’’ అంటూ సీఎంను ప్రశ్నించా.. బాన్సువాడలో మళ్లీ మనమే గెలుస్తాం

కామారెడ్డి, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి):

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాన్సువాడ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరినా ఆశించిన స్థాయిలో నిధులు రాలేదన్నారు. సీఎం చెప్పినా మంత్రులు పట్టించుకోవడం లేదని, పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు.

‘‘నేను నీకు అమ్ముడుపోయానా?’’

పార్టీ మారిన ఆరు నెలల్లో పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా సగం నిధులు మాత్రమే వచ్చాయని పోచారం తెలిపారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు నిలిపివేశారని చెప్పారు. తాను మంత్రి పదవి కోసం, డబ్బుల కోసం కాంగ్రెస్‌లో చేరలేదని.. కేవలం బాన్సువాడ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు.

గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమైన సమయంలో ‘‘నేను నీకు అమ్ముడుపోయానా? లేక నా ఎమ్మెల్యేగిరిని కొన్నావా?’’ అంటూ సీఎంను ప్రశ్నించానని పోచారం వెల్లడించారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, పరిస్థితుల ప్రభావంతోనే కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ జెండాను కాదని కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ హయాంలోనే అభివృద్ధి

కేసీఆర్‌ హయాంలోనే బాన్సువాడలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని పోచారం పేర్కొన్నారు. తనకు అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. బాన్సువాడలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగకపోయినా కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు.

‘‘మళ్లీ మనమే గెలుస్తాం’’

రాబోయే రోజుల్లో బాన్సువాడలో మళ్లీ తమదే విజయమని పోచారం ధీమా వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు నిధుల విడుదలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు, తాను కాంగ్రెస్‌లో చేరిన కారణాలను కార్యకర్తలకు వివరించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

అయితే తాను తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పోచారం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!