📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జెనోమ్‌ వ్యాలీలో ‘యామ్జెన్‌’ అతి పెద్ద పరిశోధన కేంద్రం !

జెనోమ్‌ వ్యాలీలో ‘యామ్జెన్‌’ అతి పెద్ద పరిశోధన కేంద్రం !

అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలకు వేదిక.. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): గ్లోబల్‌ బయోటెక్నాలజీ సంస్థ ‘యామ్జెన్‌’ (Amgen) హైదరాబాద్‌లోని జెనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్‌ ఎంఓయూ కుదుర్చుకుంది. అంతకుముందు యామ్జెన్‌ ఇండియా ప్రతినిధులు మంత్రితో సమావేశమై హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాల విస్తరణపై చర్చించారు.

స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం

సమావేశం అనంతరం యామ్జెన్‌ ఇండియా ఎండీ నవీన్‌ గుళ్లపల్లి, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. జెనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న పరిశోధన కేంద్రంతో స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని శ్రీధర్‌బాబు తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యామ్జెన్‌ యాజమాన్యానికి సూచించారు.

లైఫ్‌ సైన్సెస్‌కు తెలంగాణ కీలక వేదిక

యామ్జెన్‌ ఇటీవల 3 వేల మంది ఉద్యోగులతో అతిపెద్ద గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఔషధ రంగంలోని దిగ్గజ సంస్థలు తెలంగాణపై విశ్వాసం కనబరచడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, జెనోమ్‌ వ్యాలీ వంటి అభివృద్ధి చెందిన ఎకోసిస్టమ్‌ కారణంగా తెలంగాణ ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు.

పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం

దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యామ్జెన్‌ క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల ఆరోగ్యం, ఇన్‌ఫ్లమేషన్‌, శ్వాసకోశ వ్యాధులు, అరుదైన వ్యాధులకు వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లో పరిశోధన, ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు ద్వారా సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి.

ఎంఓయూ కార్యక్రమంలో పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ సర్వేశ్‌ సింగ్‌, యామ్జెన్‌ ఇండియా ఎండీ నవీన్‌ గుళ్లపల్లి, ఈడీ శ్రీను కొసరాజు, అనుమిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!