15–30 రోజుల్లో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలి.. రైతులను మానిటరింగ్ కమిటీల్లో భాగస్వాములను చేయాలి…
హైదరాబాద్, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): 2026–27 పత్తి సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో సీసీఐ అధికారులతో పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర (MSP) అందేలా చూడాలని సూచించారు.
రాష్ట్రంలో 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు, 25.85 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. లాంగ్ స్టేపుల్ కాటన్‌కు కేంద్రం క్వింటాల్‌కు రూ.8,667 MSP ప్రకటించిందని తెలిపారు. రైతులు MSP కంటే తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి రాకుండా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని 356 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి, L1 నుంచి L12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను 15–30 రోజుల్లో అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. మిల్లులు లేని ప్రాంతాలను సమీపంలోని నోటిఫైడ్ మిల్లులతో అనుసంధానించాలని ఆదేశించారు.
గత సీజన్లో 122గా ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఈసారి 131కి పెంచినట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు రద్దీ, పెండింగ్ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని మానిటరింగ్ కమిటీల్లో రైతు ప్రతినిధులను చేర్చాలని మంత్రి ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు.
కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సరళీకృతం చేసి, స్లాట్లు తెరిచే ముందు రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అవసరమైన మేరకు ఒక రైతు లేదా మొబైల్ నంబర్‌కు మల్టిపుల్ బార్కోడ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. నాణ్యత పరీక్ష పరికరాలు, సీసీ కెమెరాలు, బరువు యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని స్పష్టం చేశారు.
రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి 1800 599 5779 టోల్‌ఫ్రీ, 88972 81111 వాట్సాప్ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా రైతులకు నష్టం కలిగించే అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

