బీర్కూర్ పరిసర గ్రామాల నుంచి ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు
బాన్సువాడ, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
బీర్కూర్ పరిసర గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేయించారు.
శుక్రవారం తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో కిష్టాపూర్ బస్టాండ్ వద్ద సుమారు 20 మంది విద్యార్థులు బస్సు కోసం వేచి ఉండడం గమనించిన పోచారం శ్రీనివాసరెడ్డి వారితో మాట్లాడారు. బస్సులు సమయానికి రాకపోవడంతో ముందుగా బాన్సువాడకు వెళ్లి, అక్కడి నుంచి మరో బస్సులో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు చేరుకోవాల్సి వస్తోందని, దీంతో తరగతులకు ఆలస్యమవుతోందని విద్యార్థులు వివరించారు.
దీనిపై వెంటనే బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌తో ఫోన్లో మాట్లాడిన పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ నుంచి బీర్కూర్–కిష్టాపూర్–తిమ్మాపూర్–బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా మీదుగా ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల వరకు ఉదయం ప్రత్యేక బస్సు నడపాలని ఆదేశించారు.
అలాగే విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వెంటనే స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపిన పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.

