భక్తుల భద్రతే లక్ష్యం.. తెలుగు భక్తులపై వివక్ష ఆరోపణలతో ఆందోళన
తిరువణ్ణామలై, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్లయ్యార్ గుహ (మోక్షమార్గం) వద్ద ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఆలయ యంత్రాంగం కఠిన భద్రతా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ఇరుకైన మార్గంలో చిక్కుకుని మృతి చెందడం, మరో మహిళ త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ఘటనల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. భక్తుల ప్రాణ రక్షణే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మోక్షమార్గంలోకి ప్రవేశించే ముందు భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రిల్ పరిమాణాన్ని గుహలోని అత్యంత ఇరుకైన భాగానికి అనుగుణంగా రూపొందించారు. గ్రిల్‌లో సులభంగా వెళ్లగలిగిన వారినే మోక్షమార్గంలోకి అనుమతిస్తారు. గ్రిల్‌లో ఇరుక్కుపోయే అవకాశం ఉన్నవారు బలవంతంగా లోపలికి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
- ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మోక్షమార్గంలోకి ప్రవేశానికి అనుమతి.
- అధిక బరువు ఉన్నవారు, వృద్ధులు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు ప్రవేశించవద్దని సూచించారు.
- గ్రిల్‌లో ఇబ్బంది ఎదురైతే వెంటనే వెనుదిరగాలని, బలవంతంగా ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
- అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక సహాయక బృందాలు, హెల్ప్‌లైన్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
- తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
గత కొంతకాలంగా అరుణాచలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల తెలుగు భక్తులపై దురుసు ప్రవర్తన, ప్రాంతీయ, భాషాపరమైన వివక్షకు సంబంధించిన ఆరోపణలు వెలువడుతున్నాయి. తెలుగు నామఫలకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం, కొన్నిచోట్ల ఘర్షణలు చోటుచేసుకోవడం వంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.
కొత్త నిబంధనలు ఎలాంటి ప్రాంతీయ వివక్ష కోసం కాదని, భక్తుల ప్రాణాలను కాపాడేందుకే అమలు చేస్తున్నామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు స్థానిక సిబ్బందికి సహకరించి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
- శారీరక పరిస్థితిని అంచనా వేసుకుని మాత్రమే మోక్షమార్గంలోకి వెళ్లాలి.
- రద్దీ సమయంలో తొందరపడకుండా ఆలయ సిబ్బంది సూచనలు పాటించాలి.
- ఆరోగ్య సమస్యలు ఉంటే గుహ మార్గంలోకి వెళ్లకుండా సాధారణ దర్శనానికే పరిమితం కావడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

