114 రాడికల్ ప్రచురణలు బ్యాన్.. ఐసిస్, అల్‌ఖైదా భావజాలానికి చెక్
ముంబై, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాద ప్రచార సాహిత్యంపై మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థల భావజాలాన్ని ప్రచారం చేస్తున్న 114 రాడికల్ ప్రచురణలను స్వాధీనం చేసుకుంటూ, వాటి ప్రచురణ, పంపిణీ, విక్రయం, నిల్వ, డిజిటల్ షేరింగ్‌పై పూర్తి నిషేధం విధించింది. ఈ మేరకు ఆగస్టు 6న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS)-2023 సెక్షన్ 98(1) కింద ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), నిఘా సంస్థల నివేదికల ఆధారంగా ఈ ప్రచురణలు దేశవ్యాప్తంగా భౌతిక, డిజిటల్ రూపాల్లో చలామణి అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, అంతర్గత భద్రత, ప్రజా శాంతికి ఇవి ముప్పుగా మారుతున్నాయని పేర్కొంది.
ఐసిస్ (ISIS), ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్ ప్రావిన్స్ (ISKP), అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన ప్రచార పత్రికలు, డిజిటల్ కంటెంట్ ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా ‘వాయిస్ ఆఫ్ ఖురాసాన్’ మ్యాగజైన్‌కు చెందిన 45 సంచికలతో పాటు ‘ది రివల్యూషనరీ రిసర్జెన్స్’, ‘రాడికల్ కాశ్మీర్’ వంటి ప్రచురణలను కూడా నిషేధించింది.
పేలుడు పదార్థాల తయారీ, విషపదార్థాల వినియోగం, ఆత్మాహుతి దాడుల పద్ధతులు, ఉగ్రవాద నియామకాలకు సంబంధించిన సూచనలు ఉన్న టెర్రర్ మాన్యువల్స్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ఉద్దేశంతో ఈ ప్రచార సామగ్రిని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
- నిషేధిత ప్రచురణలను ముద్రించడం.
- విక్రయించడం లేదా పంపిణీ చేయడం.
- ఇళ్లలో లేదా కార్యాలయాల్లో నిల్వ ఉంచడం.
- PDFలు, ఈ-బుక్స్ రూపంలో భద్రపరచడం.
- వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా తదితర డిజిటల్ వేదికల ద్వారా షేర్ చేయడం.
నిషేధిత ప్రచురణలను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం, ఏటీఎస్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ వేదికల ద్వారా ఉగ్రవాద భావజాల ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు దేశ భద్రతకు కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఉగ్ర ప్రచార నెట్‌వర్క్‌లకు గట్టి దెబ్బ తగులుతుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

