సంగారెడ్డి నుంచి సీఎం రేవంత్ శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కార్డుల పంపిణీ…
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పంపిణీ చేపట్టనున్నారు.
ఈ మేరకు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల జాబితాల ఖరారు, కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాటు, ప్రజా సౌకర్యాలు, ప్రచార ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో ఆర్‌డీఓ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు చేరవేయడంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

