ఆగస్టు 9న ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు
హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): బోనాల ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఆగస్టు 9న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, తాటి కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆంక్షలు కూకట్‌పల్లి, అల్వాల్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్‌డ్ క్లబ్‌లలో నిర్వహిస్తున్న బార్లకు ఈ ఆంక్షలు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

