📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeమెదక్కాంగ్రెస్ లో నువ్వా... నేనా.... చూసుకుందాం....

కాంగ్రెస్ లో నువ్వా… నేనా…. చూసుకుందాం….

నాచారం ఆలయనికి తడిబట్టలతో ప్రమాణానికి నర్సారెడ్డి రావాలి : చిట్కూల మహిపాల్ రెడ్డి సవాల్..

నేడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ మోటారు బైక్‌ల ర్యాలీ….

తూప్రాన్/మనోహరాబాద్, జూలై 16 ( నవజ్యోతి ప్రతినిధి నవీన్ ) :

తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీలో గత కొన్ని రోజులుగా నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ యుద్ధంగా మారాయి. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు చిట్కుల మహిపాల్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు, ప్రత్యక్ష సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీయగా, వాటిపై గజ్వేల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ రాకపోవడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచుతోంది.

“దమ్ముంటే నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రా… తడిబట్టలతో గర్భగుడిలో ప్రమాణం చేద్దాం. నిజం ఎవరిదో దేవుడి సాక్షిగా తేల్చుకుందాం” అంటూ మహిపాల్ రెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మహిపాల్ రెడ్డి చేసిన ఆరోపణల ప్రకారం, గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతలో ఉన్న నర్సారెడ్డి, పార్టీని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, సీనియర్ నాయకులను అవమానిస్తూ ఏకపక్ష ధోరణితో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. నామినేటెడ్ పదవులు, పార్టీ బాధ్యతల పేరుతో భారీ మొత్తంలో డిమాండ్లు తీసుకున్నారంటు తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నాయకులతో రహస్య రాజకీయ అవగాహన ఉందని కూడా ఆరోపించారు.

ఈ ఆరోపణలు ఒకదాని వెంట ఒకటి వెల్లువెత్తుతున్నప్పటికీ, తూముకుంట నర్సారెడ్డి మాత్రం ఇప్పటివరకు స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. మౌనం వ్యూహమా? లేక హైకమాండ్ సూచనల కోసమా? అనే చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో జూలై 17 శుక్రవారం ఉదయం 10 గంటలకు నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమని మహిపాల్ రెడ్డి ప్రకటించడం, తూప్రాన్ నుంచి సుమారు రెండు వేల మోటార్‌సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించడం ఈ వివాదాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాలకే పరిమితం కాకుండా గజ్వేల్ కాంగ్రెస్‌లోని అంతర్గత అసంతృప్తి బహిరంగ రూపం దాల్చిన సంకేతంగా కనిపిస్తోంది.

ఈ వివాదంపై కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ లేదా ఏఐసీసీ జోక్యం చేసుకుని ఇరువర్గాలను సమన్వయం చేస్తుందా లేదా చూడాలి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!