ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు స్పష్టమైన సాగు సూచనలు ఇవ్వాలి
హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): జిల్లా సాగునీటి సలహా మండళ్లను వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన సాగునీటి సలహా మండళ్ల సమావేశాలను వెంటనే నిర్వహించాలని మంత్రి సూచించారు. జలాశయాల నీటి నిల్వలు, వర్షపాతం, తాగునీటి అవసరాలు, సాగునీటి లభ్యతను సమీక్షించి రైతులకు పంటల ఎంపికపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు.
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇంకా ఆశాజనకంగా లేవని పేర్కొన్న మంత్రి, అధిక నీటి అవసరమున్న వరి వంటి పంటల సాగులో రైతులు జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రస్తుత వర్షాలను చూసి నీటి ఆధారిత పంటల వైపు వెళ్లకుండా, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.
వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి అవసరాలకు తగిన నీటిని తప్పనిసరిగా నిల్వ ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్థానిక లేదా రాజకీయ ఒత్తిళ్లకు లోనై నీటిని విడుదల చేయకుండా పరిస్థితులను సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

