హైదరాబాద్, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. గతంలో పొడిగించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు గురుకుల, మోడల్, కేజీబీవీ తదితర కళాశాలల్లో ఈ గడువు వర్తించనుంది. ప్రవేశాల సమయంలో రిజర్వేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కళాశాలల యాజమాన్యాలను బోర్డు ఆదేశించింది.
ప్రత్యేక పరీక్ష నిర్వహించరాదు
ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించరాదు. గతంలో చదివిన విద్యార్థులకు జీపీఏ, సబ్జెక్టుల వారీ గ్రేడ్ పాయింట్లు, అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కళాశాలలు బోర్డు అనుమతించిన సెక్షన్లు, సీట్ల పరిమితికి లోబడి మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలి.
రిజర్వేషన్లు ఇలా..
ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ఎన్‌సీసీ, క్రీడలు, ఇతర ప్రతిభా విభాగాలకు 5 శాతం, మాజీ సైనికులు, రక్షణ సిబ్బందికి 3 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బోర్డు సూచించింది. బాలికలకు ప్రత్యేక కళాశాలలు లేని చోట మొత్తం సీట్లలో మూడో వంతు సీట్లను కేటాయించాలి.
యాంటీ డ్రగ్ డిక్లరేషన్ తప్పనిసరి
అలాగే విద్యార్థి, తల్లిదండ్రుల నుంచి యాంటీ డ్రగ్ డిక్లరేషన్ తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే విద్యార్థుల ప్రవేశాల్లో సంబంధిత నిబంధనలు పాటించాలని సూచించింది. విద్యార్థులు బోర్డు అనుమతి ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని అధికారులు స్పష్టం చేశారు.

