న్యూఢిల్లీ, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): భారత సైన్యానికి అధునాతన లూటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థలు, లూటరింగ్ మ్యూనిషన్లు, వాటి అనుబంధ పరికరాల కొనుగోలుకు రక్షణ శాఖ రూ.1,577 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), నైబ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
‘బై ఇండియన్’ కేటగిరీలో కొనుగోళ్లు
‘బై ఇండియన్’ కేటగిరీలో ఫాస్ట్ ట్రాక్ విధానం ద్వారా దేశీయ సంస్థల నుంచే ఈ కొనుగోళ్లు చేపట్టనున్నారు. లూటరింగ్ మ్యూనిషన్లు లక్ష్య ప్రాంతంపై కొంతసేపు సంచరిస్తూ, అవసరమైన సమయంలో లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధ వ్యవస్థలు. వీటిని ఆర్టిలరీ రెజిమెంట్లలో ప్రవేశపెట్టడం ద్వారా సైన్యం దాడి సామర్థ్యం, కార్యాచరణ సామర్థ్యం మరింత పెరగనుంది.
ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
దేశీయంగా రక్షణ పరికరాల తయారీని ప్రోత్సహించడంతో పాటు విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఇది మరింత ఊతమిస్తుందని రక్షణ శాఖ పేర్కొంది.

