హైదరాబాద్, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం లోటు, సుదీర్ఘ పొడి వాతావరణం పూల సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉందని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన 2026-27 పంటల అత్యవసర ప్రణాళిక హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ప్రాంతాల వారీగా మారే అవకాశం ఉండటంతో పూల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
బంతి, చామంతికి వేడి దెబ్బ
అధిక ఉష్ణోగ్రతలు బంతి, చామంతి పూలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వేడి తీవ్రతతో రేకులు ఎండిపోయి రంగు వెలిసిపోవడంతోపాటు పూల నాణ్యత తగ్గొచ్చని తెలిపారు. మధ్యకాలంలో వర్షాభావం ఏర్పడితే ముందుగానే మొగ్గలు రావడం, చిన్న పరిమాణంలో పూలు పూయడం, మార్కెట్ విలువ తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చని ప్రణాళికలో పేర్కొన్నారు. అధిక విలువైన రకాల సాగులో షేడ్‌నెట్లను ఉపయోగించాలని సూచించారు.
గులాబీ, సంపంగికి నీటి కష్టాలు
అధిక ఉష్ణోగ్రతలతో గులాబీలో పూలు ఇవ్వని కొమ్మలు పెరిగే అవకాశం ఉండగా.. పూల పరిమాణం తగ్గవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. ఎక్కువకాలం వర్షాభావం కొనసాగితే ఆకులు రాలే ప్రమాదం కూడా ఉందని పేర్కొంది. సంపంగి మొక్కల్లో నీటి కొరత కారణంగా పూల కాడలు పొట్టిగా లేదా ఆకృతి కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. మొగ్గలు ఏర్పడే దశలో నీటిని అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది.
మల్లెకు దిగుబడి పెరిగినా.. నాణ్యతకు దెబ్బ
మల్లె విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో పూల దిగుబడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. వేడికి పూలు త్వరగా విచ్చుకోవడంతో సువాసన నాణ్యత తగ్గవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు రెండుసార్లు పూలను కోయాలని సూచించారు.
అతివర్షంతోనూ ముప్పే
వర్షాభావంతోపాటు అధిక వర్షాలు కూడా పూల రైతులకు ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. బంతి, చామంతిలో మొగ్గ కుళ్లు, వేరు కుళ్లు వంటి శిలీంధ్ర వ్యాధులు పెరగవచ్చని ఉద్యాన విశ్వవిద్యాలయం హెచ్చరించింది. ఎక్కువకాలం తేమ కొనసాగితే మల్లె, గులాబీ, సంపంగి మొక్కల్లో ఆకులు ఎక్కువగా పెరిగి పూల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని తెలిపింది.
బతుకమ్మ వేళ ధరలపై ప్రభావం?
తెలంగాణలో పూలకు సాధారణంగానే ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా బతుకమ్మ, వివాహాలు, ఇతర పండుగల సమయంలో డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పూల సరఫరా తగ్గడంతో జూలైలో టోకు ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పూల సాగుపై వాతావరణ ప్రభావం కొనసాగితే రానున్న పండుగల సమయంలో నాణ్యత, సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రైతులకు ఉద్యాన వర్సిటీ సూచనలు
పూల తోటల్లో బిందు సేద్యం, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, షేడ్‌నెట్లు వంటి పద్ధతులను అనుసరించాలని ఉద్యాన విశ్వవిద్యాలయం సూచించింది. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉద్యాన రైతుల కోసం ప్రత్యేక పంటల అత్యవసర ప్రణాళికను విశ్వవిద్యాలయం ఇప్పటికే విడుదల చేసింది.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మూడు దశల పంటల అత్యవసర ప్రణాళికను అమలు చేస్తోంది. తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

