సంపన్నుడినంటూ మహిళలకు గాలం.. 20 మంది బాధితులు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): స్నాప్‌చాట్ ద్వారా మహిళలకు పరిచయమై, తాను సంపన్నుడినంటూ నమ్మించి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన సాగర్ చౌదరి అలియాస్ సాయి సునీల్ (25) ప్రధాన నిందితుడు కాగా, శివాంగుల భారత్ కుమార్ (28) అతడి సహచరుడు.
ఖరీదైన అద్దె కార్లలో తిరుగుతూ మహిళలను ఆకర్షించి, వారితో సన్నిహితంగా మెలిగేవాడని పోలీసులు తెలిపారు. నమ్మకం ఏర్పడిన తర్వాత మహిళల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యేవాడని, చోరీ చేసిన ఆభరణాలను భారత్ కుమార్ తన పరిచయాల ద్వారా విక్రయించేవాడని వెల్లడించారు.
20 మంది బాధితులు.. 40 తులాల వరకు బంగారం
ఇప్పటివరకు 20 మంది బాధితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు 35 నుంచి 40 తులాల వరకు బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుల నుంచి 3 తులాల బంగారం, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా మరికొందరు బాధితులు ఉండే అవకాశం ఉందని, ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి నిందితుల వ్యవహారాలపై మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ అజయ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

