సినీ నటుడు సుమన్ తల్వార్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం
హైదరాబాద్, జూలై 26 (నవజ్యోతి ప్రతినిధి):
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తీసుకొచ్చిన మన్నే రిత్విక్ ముదిరాజ్‌ను హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ తల్వార్ రిత్విక్‌కు ప్రత్యేక అవార్డును అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రధాని శ్రీనివాస్ గౌడ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ చైర్మన్ టీవీ అశోక్, తెలంగాణ సినీ ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. రిత్విక్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక, అభినందన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే గిన్నిస్ రికార్డు సాధించడం అరుదైన విజయమని కొనియాడారు. రిత్విక్ సాధించిన ఘనత తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. యువత క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే సందేశాన్ని ఆయన విజయగాథ అందిస్తోందన్నారు.
కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ పోచయ్య, పలువురు కరాటే మాస్టర్లు, క్రీడా ప్రముఖులు, సినీ రంగ ప్రతినిధులు, అభిమానులు పాల్గొని రిత్విక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించి భారతదేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

