కుత్బుల్లాపూర్, జూలై 23: (నవజ్యోతి ప్రతినిధి) వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన గురువారం దుందిగల్ సర్కిల్
294వ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. కాలనీల్లోని పారిశుధ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి పనులను పరిశీలిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీ అధ్యక్షుడు అమర్నాథ్, కాలనీలో చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల వివరాలను పొందుపరిచిన వినతిపత్రాన్ని ఆమెకు అందజేసి తక్షణ పరిష్కారం కల్పించాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన సిఎంసి కమిషనర్ సృజన సమస్యలను శ్రద్ధగా విన్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారుల సానుకూల స్పందనతో కాలనీవాసులు సమస్యల పరిష్కారంపై ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానిక సమస్యలను ప్రజల నుంచే నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించడం ‘ఎవరీ డే–వన్ వార్డు’ కార్యక్రమం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. స్థానికులు కూడా ఇలాంటి పర్యటనలు తరచూ నిర్వహించి పెండింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

