ప్రభుత్వ హామీతో ఆగస్టు 8 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మె రద్దు..
హైదరాబాద్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులు ఆగస్టు 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన నిరవధిక సమ్మెను విరమించుకున్నారు. గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, గిగ్ కార్మికుల సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గిగ్ కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టం–2026ను వీలైనంత త్వరగా అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
పెండింగ్‌లో ఉన్న డిమాండ్లన్నింటినీ సానుభూతితో పరిశీలించి దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, గౌరవప్రదమైన ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ జేఏసీ నిరవధిక సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సంక్షేమ చట్టం పూర్తిస్థాయిలో అమలవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, సామాజిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు కీలక ముందడుగుగా నిలుస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

