📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కొణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రూ.9.26 లక్షల గంజాయి స్వాధీనం !

కొణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రూ.9.26 లక్షల గంజాయి స్వాధీనం !

ఈగిల్‌ ఫోర్స్‌ మెరుపు దాడులు.. మరో 30 కిలోలకు పైగా మాదకద్రవ్యాల ధ్వంసం..

హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై తెలంగాణ ఈగిల్‌ ఫోర్స్‌ ఉక్కుపాదం మోపింది. కొణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద నుంచి రూ.9.26 లక్షల విలువైన 18.538 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసింది. మరోవైపు ఐదు ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించిన 30 కిలోలకు పైగా మాదకద్రవ్యాలను శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేసింది.

కొణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పట్టుబడ్డ గంజాయి

ఈగిల్‌ రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ (రైల్వే) బృందం, రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌)తో కలిసి కొణార్క్ ఎక్స్‌ప్రెస్‌ (11020)లో తనిఖీలు నిర్వహించింది. రెండు బ్యాక్‌ప్యాక్‌లు, ఒక ట్రాలీ బ్యాగ్‌లో 13 ప్యాకెట్లలో దాచిన 18.538 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన నిరంజన్ ప్రధాన్‌ (22)ను అరెస్టు చేసి, అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుంది.

ముఠాపై దర్యాప్తు

విచారణలో ఒడిశా నుంచి పుణేకు గంజాయిని తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న దీపక్ ప్రధాన్‌తో పాటు అక్రమ రవాణా ముఠాలోని ఇతర సభ్యుల కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని నాంపల్లి జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు.

30 కిలోలకు పైగా మాదకద్రవ్యాల ధ్వంసం

యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపూర్‌లోని రోమా ఇండస్ట్రీస్‌లో ఐదు ఎన్‌డీపీఎస్ కేసులకు సంబంధించిన 25.950 కిలోలు, 2.068 కిలోలు, 1.067 కిలోల గంజాయి, 1.146 కిలోల గంజాయి చాక్లెట్లు, 8.54 గ్రాముల కొకైన్‌, 46.26 గ్రాముల మెఫెడ్రోన్‌ను చట్టపరమైన నిబంధనల మేరకు శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేశారు.

ప్రజలకు ఈగిల్‌ ఫోర్స్‌ విజ్ఞప్తి

మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు టోల్‌ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ 87126 71111 లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేయాలని ఈగిల్‌ ఫోర్స్‌ కోరింది. సమాచారదాతల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు విశ్వసనీయ సమాచారానికి బహుమతి కూడా అందజేస్తామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!