ఇద్దరు కార్మికులు దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం
మనోహరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి నవీన్): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామ చౌరస్తాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానికుల వివరాల ప్రకారం, దండుపల్లి చౌరస్తాలోని మదీనా చికెన్ సెంటర్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు, క్షతగాత్రుడు, అలాగే డీసీఎం వాహనం రంగాయపల్లి ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ పరిశ్రమకు చెందినవారేనని స్థానికులు చెబుతున్నప్పటికీ, దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతుల వివరాలు, డీసీఎం డ్రైవర్‌కు సంబంధించిన సమాచారం, ప్రమాద పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.

