📄 ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeమెదక్ఎన్‌డీపీఎస్ కేసులో ఇద్దరు దోషులకు కఠిన కారాగార శిక్ష.

ఎన్‌డీపీఎస్ కేసులో ఇద్దరు దోషులకు కఠిన కారాగార శిక్ష.

1.6 కిలోల డ్రై గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు.

నిందితులకు రూ.లక్ష చొప్పున జరిమానా.. మెదక్ అదనపు జిల్లా కోర్టు తీర్పు

రామాయంపేట, జులై 17 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : 

రామాయంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు మెదక్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదేవిధంగా ప్రతి నిందితుడికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 2019 సెప్టెంబర్ 11న రామాయంపేట స్టేషన్ పరిధిలోని చేగుంట గ్రామంలో నిర్వహించిన దాడుల్లో తిల్పితియా రెడ్డి సింగ్, తిల్పితియా బబ్లు సింగ్ అలియాస్ యాషు సింగ్ నివాసంలో 1.6 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

దర్యాప్తు అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో అప్పటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆర్. నరేష్ కుమార్ పంచనామా అధికారిగా వ్యవహరించగా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సూర కృష్ణయ్య దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ సమర్పించారు.

ఎస్.సి. నంబర్ 22/2020గా మెదక్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టులో విచారణ జరగగా, ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశం సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ ఒక్కొక్కరికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించింది.ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్ఠమైన సాక్ష్యాధారాల సమర్పణ, ప్రభుత్వ తరఫున బలమైన వాదనల ఫలితంగానే నిందితులకు శిక్ష పడిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కోర్టు విధుల నిర్వహణలో కానిస్టేబుళ్లు ఒమర్ అలీ, డేనియల్ సహకరించినట్లు పేర్కొన్నారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప ఎక్సైజ్ అధికారులకు తెలియజేసి ప్రజలు సహకరించాలని రామాయంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సిద్ధార్థ్ విజ్ఞప్తి చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!