ఇందిరమ్మ ఇళ్లకు రూ.230 కే సిమెంట్ బస్తా
పరిశ్రమల సామాజిక బాధ్యతకు మంత్రి పొంగులేటి ప్రశంసలు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ధరల తగ్గింపుపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు
ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్ మినహా) మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే గణనీయ సంఖ్యలో 85 శాతం ఇళ్ల శ్లాబులు పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రెండో విడతలో నియోజకవర్గానికి రెండు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశాం. అలాగే క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ కు శ్రీకారం చుట్టాం.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడినా పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతికి అనుగుణంగా విడతల వారీగా ప్రతి సోమవారం పారదర్శకంగా నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటిలో నివసించే వరకు ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ బృహత్తరమైన ఇందిరమ్మ ఇళ్ల పధకంలో సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన సిమెంట్‌ను తక్కువ ధరకే అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తే తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రం లక్ష్యాన్ని త్వరితగతిన సాధించవచ్చని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి వర్గం సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పేదవాడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయమందిస్తే ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యాలను కూడా చిరస్ధాయిగా గుర్తుపెట్టుకుంటారని అన్నారు. మంత్రిగారి విజ్ఞప్తి మేరకు ఒక్కో బస్తాను 230 రూపాయిలకు ఇవ్వడానికి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈసందర్బంగా మంత్రి పొంగులేటి యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల యాజమాన్యాలతోపాటు హౌసింగ్ సెక్రటరీ వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
22ఎకు సంబంధించి 24గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు చేశాం
తప్పును ఒప్పుకొని సరిదిద్దుతున్నాం
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
సామాన్య ప్రజల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత మాది
15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన
మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇది పేదల ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ఆధ్వర్యంలో పేదల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడికి అన్యాయం చేయదని . పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోదని వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రిగారు మాట్లాడారు. 22ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టం చేస్తూ సమస్య పరిష్కార ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని 24 గంటల్లోనే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 మొత్తం 34 రిజిస్ట్రేషన్లు జరిగాయని మంత్రి గారు వివరించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందని తెలిపారు.
బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా పొరపాటును పారదర్శకంగా అంగీకరించి . అదే సమయంలో జరిగిన తప్పును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నామని ప్రజలను ఇబ్బందుల్లో వదిలేసే ప్రభుత్వం తమది కాదని స్పష్టం చేశారు.
వివిధ జీవోలు, మెమోల ద్వారా గత ప్రభుత్వాల కాలంలో క్రమబద్ధీకరించబడిన ప్రైవేట్ భూములు, హైకోర్టు మరియు జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు ఆన్‌లైన్ అప్‌లోడింగ్‌లో సాంకేతిక లోపం కారణంగా 22ఏ జాబితాలోకి వచ్చాయని మంత్రి వివరించారు.ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించిందని, బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని తెలిపారు.
22ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి . జెన్యూన్ ప్రైవేట్ ఆస్తులన్నింటినీ తక్షణమే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇప్పుడు పేదవాడి సమస్యను రాజకీయంగా వాడుకోవడం మానేయండి. ఇది పేదల ప్రభుత్వం.. పేదల ఆశీస్సులతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యాయం జరగనివ్వం. మేం తప్పును ఒప్పుకుని దిద్దుతున్నాం.. మీరు చేసిన తప్పులను ఒప్పుకునే ధైర్యం మీకుందా?” అని ప్రశ్నించారు. అబద్ధాలు, ఆరోపణలు, రాజకీయ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు.
తప్పు జరిగితే దాన్ని అధికారుల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే పొరపాటును అంగీకరించామన్నారు.

