ఓకొనుగోళ్లకు తామే కారణమన్నట్లుగా చూపించి కమీషన్లు పొందారన్న ఆరోపణలు
న్యూయార్క్, ఆగస్టు 19 (నవజ్యోతి ప్రతినిధి):
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కుమార్తె ఫోబీ గేట్స్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న Phia అనే షాపింగ్ స్టార్టప్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆన్‌లైన్ కొనుగోళ్లకు తామే కారణమన్నట్లుగా చూపించి కమీషన్లు పొందేందుకు ‘కుకీ స్టఫింగ్’ పద్ధతిని ఉపయోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
Phia బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ రూపంలో పనిచేసే ఏఐ ఆధారిత షాపింగ్ అసిస్టెంట్. వివిధ వెబ్‌సైట్లలో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తక్కువ ధరలు, డీల్స్‌ను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఆరోపణల ప్రకారం.. వినియోగదారు Phia సూచనపై క్లిక్ చేయకపోయినా బ్రౌజర్‌లో దాని అఫిలియేట్ ట్రాకింగ్ కుకీ నమోదయ్యేలా కొన్ని ఫీచర్లను రూపొందించారు. దీంతో ఆ తర్వాత జరిగే కొనుగోళ్లకు Phia రిఫరల్ కమీషన్ పొందే అవకాశం ఏర్పడింది.
2025 డిసెంబర్ నుంచే తెలుసా?
తొలుత ఈ వ్యవహారాన్ని ఇటీవల గుర్తించిన సాఫ్ట్‌వేర్ సమస్యగా Phia పేర్కొంది. అయితే ఆగస్టులో వెలువడిన Bloomberg ఆధారిత నివేదిక ప్రకారం.. ఫోబీ గేట్స్, ఆమె సహ వ్యవస్థాపకురాలు సోఫియా కియానీతో పాటు కంపెనీలోని ఇతర అధికారులు ఈ ఫీచర్ల గురించి 2025 డిసెంబర్ నుంచే తెలుసుకున్నట్లు అంతర్గత Slack సందేశాలు, కోడ్ వివరాలు సూచిస్తున్నాయి.
దీంతో కంపెనీ గతంలో ఇచ్చిన ‘సాఫ్ట్‌వేర్ బగ్’ వివరణపై ప్రశ్నలు తలెత్తాయి. Phia మాత్రం సమస్యకు కారణమైన ఫీచర్లను జూలై 7న తొలగించినట్లు తెలిపింది. తప్పుగా తమకు ఆపాదించిన లావాదేవీలను పరిశీలించి, సంబంధిత బ్రాండ్‌లకు అవసరమైన మొత్తాలను తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా కంప్లయెన్స్ అధికారిని నియమించనున్నట్లు పేర్కొంది.
ఫీచర్ల తొలగింపుతో ఆదాయానికి దెబ్బ
కుకీ స్టఫింగ్ ఫీచర్లను నిలిపివేసిన తర్వాత Phia రోజువారీ ఆదాయంలో భారీగా తగ్గుదల కనిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో రోజుకు సుమారు 80 వేల డాలర్ల వరకు ఉన్న ఆదాయం, ఫీచర్ల తొలగింపు తర్వాత సుమారు 10 వేల నుంచి 28 వేల డాలర్ల మధ్యకు పడిపోయినట్లు Bloomberg విశ్లేషణను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొన్నాయి.
క్రిమినల్ కేసు నమోదు కాలేదు
ఈ వ్యవహారంలో ఫోబీ గేట్స్ లేదా Phiaపై ఇప్పటివరకు క్రిమినల్ కేసు లేదా అధికారిక నేరారోపణ నమోదైనట్లు సమాచారం లేదు. ‘వైర్ ఫ్రాడ్’ వంటి చట్టాలు వర్తించే అవకాశం ఉందని కొందరు న్యాయ నిపుణులు పేర్కొన్నప్పటికీ, 20 ఏళ్ల జైలు శిక్ష తప్పనిసరిగా ఉంటుందని చెప్పడం సరికాదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

