మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత
6.29 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని రైతు కుటుంబం ఆరోపణ
మనోహరాబాద్, ఆగస్టు 18 (నవజ్యోతి ప్రతినిధి నవీన్): భూ రిజిస్ట్రేషన్ వివాదంపై మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. కాళ్లకల్‌కు చెందిన వర్గంటి మల్లారెడ్డి, నాగిరెడ్డి కుటుంబ సభ్యులు తమకు చెందిన భూమిని తమ ప్రమేయం లేకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి చెందిన మల్లారెడ్డి తీవ్ర ఆవేదనకు గురై పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా, పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
6.29 ఎకరాల భూమిపై వివాదం
బాధిత కుటుంబ సభ్యుడు వర్గంటి నాగిరెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన 6.29 ఎకరాల భూమిపై గతంలో పట్టా మార్పిడి జరిగిందని తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండానే భూమికి సంబంధించిన మార్పులు, అనంతరం రిజిస్ట్రేషన్ జరిగాయని ఆరోపించారు. గత నెల 28న తహసీల్దార్‌ను, అనంతరం ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ భూమిని ఈ నెల 11న తమ ప్రమేయం లేకుండా బయటి వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు కోరుతామని నాగిరెడ్డి తెలిపారు.
తహసీల్దార్ వివరణ
ఈ ఆరోపణలపై తహసీల్దార్ ఆంజనేయులును వివరణ కోరగా, భూ భారతి చట్టం ప్రకారం ఏజీపి పట్టాను కోర్టు స్టే లేకుండా నిలిపివేయడం తమ పరిధిలో లేదని తెలిపారు. ఏజీపి పట్టాదారుకు ఉన్న హక్కుల ఆధారంగానే భూమికి సంబంధించిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
రైతు కుటుంబం చేసిన ఆరోపణలు, అధికారుల వివరణల నేపథ్యంలో ఈ భూ వివాదంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

