రోస్టర్ పాయింట్ల మార్పు కోసం ఉద్యమం
మాలలకు న్యాయం చేయాలి: ఎంసీఎఫ్
రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలి
సెప్టెంబర్ 7న మెదక్ కలెక్టరేట్ ఎదుట దీక్షకు పిలుపు.
రామాయంపేట,ఆగస్టు 18 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
విద్యా, ఉద్యోగ నియామకాల్లో మాలల రోస్టర్ పాయింట్లను 22 నుంచి 16కు సవరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న ‘చలో మెదక్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాలల కోఆర్డినేషన్ ఫోరం (ఎంసీఎఫ్) రాష్ట్ర నాయకులు పి.శంకర్ తెలిపారు.
మంగళవారం నిజాంపేటలో ఎంసీఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎంపిరికల్ డేటా సేకరణ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల మాలలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రోస్టర్ పాయింట్లను సవరించాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేకపోవడంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు సెప్టెంబర్ 7న మెదక్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎంసీఎఫ్ నాయకులు దుబాసి సంజీవ్, బ్యాగరి చంద్రం, నీరుడి బాలరాజు, శ్రీనివాస్, వివిధ సంఘాల ప్రతినిధులు మల్లేశం,విక్రమ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

