భూగర్భ జలాల పెంపున కే ‘జలసిరి’
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ఫామ్ పాండ్‌ల తో ప్రయోజనం
రామాయంపేట,ఆగస్టు18 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి భవిష్యత్‌లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాట్రియాల్ గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా సూచించారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా పొలాల్లోనే నిల్వ చేసుకోవడం ద్వారా పంటలకు సాగునీటి ఇబ్బందులను కొంతవరకు అధిగమించవచ్చన్నారు.
మంగళవారం గ్రామంలో ‘జలసిరి’ పథకం కింద ఫామ్‌పాండ్ నిర్మాణ పనులను సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, గ్రామ కార్యదర్శి ధనలక్ష్మితో కలిసి పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఈ ఫామ్‌పాండ్‌ను 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో పొలాల్లోకి వచ్చే నీటిని ఫామ్‌పాండ్‌లో నిల్వ చేసి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవచ్చన్నారు.
ఫామ్‌పాండ్‌లలో నిల్వ చేసిన నీరు భూమిలోకి ఇంకడం ద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు బోర్లు, బావులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించేందుకు నీటి సంరక్షణ ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా అర్హత కలిగిన రైతులు ఫామ్‌పాండ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న రైతులు మరిన్ని వివరాల కోసం గ్రామ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సభావత్ బాబు, కార్యదర్శి ధనలక్ష్మి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల శ్రీశైలం, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

