మిర్యాలగూడ, జూలై 28 (నవజ్యోతి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనకు మద్దతు తెలపడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, తెలంగాణ విద్యార్థుల సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిని త్వరితగతిన నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా మరో విద్యార్థి ఉద్యమం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

