ఢిల్లీ విమానాశ్రయంలో అక్రమ రవాణా యత్నం భగ్నం.. జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద స్వాధీనం
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ బంగారం అక్రమ రవాణా యత్నాన్ని భగ్నం చేశారు. నిఘా సమాచారం, ప్రయాణికుల ప్రొఫైలింగ్ ఆధారంగా జెడ్డా నుంచి ముంబై మీదుగా 6E-6133 విమానంలో ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడిని టెర్మినల్-1 వద్ద తనిఖీ చేశారు.
ప్రయాణికుడు చెక్-ఇన్ లగేజీతో పాటు ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా తీసుకొచ్చాడు. ఎక్స్‌రే స్కానింగ్‌లో అనుమానాస్పద దృశ్యాలు కనిపించడంతో అధికారులు స్కూటర్‌ను పూర్తిగా విడదీసి పరిశీలించారు. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లో ఎలాంటి అలారం రాకపోయినా, స్కూటర్ టైర్ల ఘన భాగంలో అత్యంత చాకచక్యంగా దాచిన బంగారాన్ని గుర్తించారు.
స్కూటర్ టైర్లలో దాచిన 24 క్యారెట్లకు చెందిన 19 బంగారం ముక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం నికర బరువు 869.5 గ్రాములుగా నిర్ధారించారు.
కస్టమ్స్ తనిఖీలను తప్పించుకునేందుకు అత్యంత పక్కా ప్రణాళికతో ఈ-స్కూటర్ టైర్లలో బంగారాన్ని దాచినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి, బంగారం మూలం, అక్రమ రవాణా ముఠాతో ఉన్న సంబంధాలు, అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

