సూరారం డ్రైనేజీ సమస్యపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ స్పందన.. కొత్త యూజీడీ నిర్మించాలని స్థానికుల డిమాండ్
కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): నవజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అధికారులు సూరారం కాలనీలో నెలలుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యపై తక్షణ చర్యలు చేపట్టారు. కొంపల్లి సర్కిల్ పరిధిలోని సాయిబాబానగర్ డివిజన్‌లో ఓం జెండా మార్కెట్ ప్రధాన రహదారి, గార్డెన్ కేఫ్ సమీప గల్లీలో రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు నీటిని తొలగించి, డ్రైనేజీ అడ్డంకులను నివారించారు.
నవజ్యోతి కథనం వెలువడిన వెంటనే హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రైనేజీ లైన్లను శుభ్రం చేయించారు. దీంతో రెండు ప్రాంతాల్లో మురుగు నీటి ప్రవాహం సక్రమంగా జరిగి స్థానికులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
సమస్యను వెంటనే గుర్తించి చర్యలు తీసుకున్న అధికారులతో పాటు ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన నవజ్యోతి దినపత్రికకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో రోజులుగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు వెంటనే స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రస్తుతం చేపట్టిన చర్యలు తాత్కాలిక పరిష్కారమేనని, సూరారం కాలనీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే సమస్య మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో డ్రైనేజీ సమస్య పూర్తిగా తొలగాలంటే ఆధునిక యూజీడీ వ్యవస్థను నిర్మిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందించాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులను స్థానికులు కోరారు. శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

