రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, జూలై 22 (నవజ్యోతి ప్రతినిధి) కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు నిరసనగా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాయకత్వంలో సుమారు వెయ్యి మంది విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం రాజీవ్ చౌక్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, ప్రతిపక్షాల గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తోందని నిరసనకారులు ఆరోపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేసి, వారిని నిర్బంధాల నుంచి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

