‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ కేసులో సల్మాన్‌కు కోర్టు సమన్లు
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ‘స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్’ డైరెక్టర్లకు చండీగఢ్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్ వ్యవహారంలో నమోదైన మోసం కేసు విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ‘బీయింగ్ హ్యూమన్’ జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు కోసం కంపెనీ ఇచ్చిన హామీలను నమ్మి సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. షోరూమ్ ఏర్పాటుకు భారీగా ఖర్చు చేసినప్పటికీ, వ్యాపార నిర్వహణలో కంపెనీ నుంచి తగిన సహకారం అందలేదని, అనంతరం జ్యువెలరీ సరఫరా కూడా నిలిచిపోవడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
షోరూమ్ ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ స్వయంగా హాజరవుతారని చెప్పి, చివరకు ఆయన బావ ఆయుష్ శర్మను మాత్రమే పంపారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాలతో పాటు వ్యాపార ఒప్పందంలో మోసపూరిత హామీలు ఇచ్చారని ఆరోపిస్తూ కంపెనీ ప్రతినిధులతో పాటు సల్మాన్ ఖాన్ పేరును కూడా కేసులో ప్రస్తావించారు.
అయితే ఈ ఆరోపణలను సంబంధిత సంస్థ గతంలోనే ఖండించింది. ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ లైసెన్స్ మాత్రమే తమ వద్ద ఉందని, షోరూమ్ నిర్వహణ, మార్కెటింగ్, వ్యాపార లావాదేవీలు పూర్తిగా కంపెనీ పరిధిలోనే జరిగాయని, ఈ వ్యవహారంలో సల్మాన్ ఖాన్‌కు ప్రత్యక్ష పాత్ర లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కోర్టు సమన్లు జారీ చేయడం విచారణ ప్రక్రియలో భాగమేనని, కేసులో వచ్చిన ఆరోపణలపై ఇంకా న్యాయస్థానం తుది నిర్ణయం వెలువరించాల్సి ఉందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.

